తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Ande Sri | సాహితీ శిఖరం నేలకొరిగింది. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ గీతాన్ని రాసిన అందెశ్రీ (64) (Ande sri) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 7.25 గంటలకు కన్నుమూసినట్లు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.
Ande Sri | అందెశ్రీ ప్రస్థానం
అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన 1961 జులై 18న సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో పుట్టారు. గొర్రెల కాపరిగా తన జీవన ప్రస్థానాన్ని ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్న వాడు..’ గీతంతో పేరు తెచ్చుకున్నారు. కాకతీయ వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర గీతంగా గుర్తించింది. అంతే కాకుండా ఇటీవల ఆయనకు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి పురస్కారం అందించింది.
Ande Sri | దక్కిన పురస్కారాలు
అందెశ్రీ దిట్ట 2006 సంవత్సరంలో గంగ సినిమాకు ఆయనకు నంది పురస్కారం దక్కింది. ఇక 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ లభించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం వరించింది. అలాగే రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం దక్కించుకున్నారు. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం అందుకున్నారు. అందెశ్రీ లోక్‌నాయక్ పురస్కారాన్ని పొందారు.
Ande Sri | దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
అందెశ్రీ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రచించిన అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన గేయం కోట్ల మంది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. కాగా.. అందెశ్రీకి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహింంచాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఇది కూడా చదవండి..: Vande Mataram 150 years celebrations | వందేమాతరం గీతానికి నేటితో 150 సంవత్సరాలు.. దేశవ్యాప్తంగా వేడుకలు
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai