తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి.. ఈ విశిష్టమైన రోజు హిందూ సంప్రదాయంలో అత్యంత మహోన్నతమైన పర్వ దినాలలో ఒకటి. ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేస్తారని భక్తుల విశ్వాసం. సాధారణంగా మార్గశిరశుద్ధ ఏకాదశి లేదా పుష్యశుద్ధ ఏకాదశి రోజున ఈ పర్వదినం జరుపుకుంటారు. ఈ రోజు ప్రత్యేకతలు ఏమిటి? ఆచరించాల్సిన నియమాలను తెలుసుకుందాం..
Vaikunta Ekadashi | ముక్కోటి ఏకాదశి విశిష్టత
సంవత్సరంలో 24 ఏకాదశి తిథులు వస్తాయి. అన్నీ పవిత్రమే అయినప్పటికీ, ముక్కోటి ఏకాదశి అత్యంత విశిష్టమైనదిగా పరిగణిస్తారు. ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadashi) అంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలోని శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశిగా గుర్తిస్తారు. శాస్త్రాల ప్రకారం.. ఈ రోజు మూడు కోట్ల దేవతలు భూమిపై అవతరిస్తారని నమ్మకం.
Vaikunta Ekadashi | ఉత్తర ద్వార దర్శనం
భక్తుల కోరికలను నెరవేర్చి, మోక్ష ప్రదానం చేసే ఈ తిథికి మోక్షదా ఏకాదశి అనే పేరు కూడా ఉంది. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చి, మూడు కోట్ల దేవతలతో పాటు భక్తులను అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
Vaikunta Ekadashi | ఆచరించాల్సిన నియమాలు
ధనుర్మాసంలో ఆధ్యాత్మికతను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఈ పర్వదినం రోజు కొన్ని ప్రత్యేక నియమాలను పాటిస్తుంటారు.
- బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం ఉత్తమం. నదీ స్నానం చేయడం శ్రేష్ఠమైన ఫలితాన్ని ఇస్తుంది. అది సాధ్యం కాని వారు స్నాన జలంలో గంగాజలం కలిపి లేదా సమస్త పుణ్య నదులను ధ్యానంతో ఆవాహన చేసుకుని స్నానం చేయవచ్చు.
- ఇంటి పూజాగృహాన్ని శుభ్రం చేసి, ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. శ్రీ లక్ష్మీ నారాయణులను తులసి దళాలు, గంధం, పుష్పాలతో అలంకరించి షోడశోపచార పూజలు సమర్పించాలి. విష్ణుమూర్తికి ఇష్టమైన చక్రపొంగలి నివేదన చేయడం మంచిది. ఆ తర్వాత వైష్ణవ ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకోవాలి. ఈ దర్శనం సర్వశుభాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. అదనంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం మోక్షాన్ని కలిగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
- ఈ రోజు ఉపవాసం ఆచరించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అన్నం, పప్పు ధాన్యాలు తీసుకోవడం వర్జితం. పగలంతా నిరాహారంగా ఉండి, సాయంత్రం చంద్రుడు ఉదయించకముందు పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం స్వీకరించడం శ్రేష్ఠం.
- రాత్రివేళ భగవంతుని నామస్మరణ, భజనలు, కీర్తనలు మరియు భాగవత చర్చలతో జాగరణ చేయాలి. ఈ జాగరణ వల్ల మూడు కోట్ల జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు తెలిపాయి.
గమనిక : మేం అందించిన ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్లో లభించిన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.
ఇది కూడా చదవండి..: Horoscope 2026 | 2026 సంవత్సర రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు..!