తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Karthika Amavasya | పవిత్రమైన కార్తీక మాసం అమావాస్యతో ముగియనుంది. ఈ మాసంలో నదీ స్నానాలు, పూజలు, వ్రతాలు, నోములతో ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. అయితే కార్తీక వ్రతం పూణ్య ఫలం దక్కాలంటే చివరి రోజైన అమావాస్య నాడు పాటించాల్సిన నియమాలు.. తిథి, శుభముహూర్తం వంటి విషయాలను తెలుసుకుందామా..
ప్రతి నెల వచ్చే అమావాస్య, పౌర్ణమిలకు ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమితో పాటు అమావాస్యకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి యేటా ఈ మాసంలో వచ్చే కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను కార్తీక అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున పూర్వీకులను ఆరాధిస్తే పితృదేవతల ఆత్మలకు శాంతి కలిగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. పితృపూజకు కార్తీక అమావాస్యను అత్యంత పవిత్రమైందిగా భావిస్తుంటారు. ఈ రోజు నదీ స్నానాలు ఆచరిస్తారు. అంతే కాకుండా దానధర్మాలు చేస్తుంటారు. కార్తీక అమావాస్య రోజు శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్ముతారు.
Karthika Amavasya | అమావాస్య తిథి..
హిందూ క్యాలెండర్ ప్రకారం.. అమావాస్య తిథి నవంబర్ 19న ఉదయం 9:44 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే 20వ తేదీ మధ్యాహ్నం 12:17 గంటలకు ముగియనుంది. అయితే అయితే సూర్యోదయానికి ఉండే తిథిని పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే నవంబర్ 20న కార్తీక అమావాస్య జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
Karthika Amavasya | అమావాస్య ప్రాముఖ్యత
కార్తీక అమావాస్య విశేషమైందిగా హిందూ పురాణాలు చెబుతున్నాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల శక్తుల నుంచి బయటపడేందుకు ఈ రోజున పూజలు చేస్తారు. పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగిందుకు పితృ పూజలు, తిలా తర్పణం, పిండ దానం చేస్తారు. ఈ రోజు పేదవారికి అవసరమైన వస్తువులు దానం చేయడం పుణ్యకార్యంగా భావిస్తుంటారు. ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజు శక్తికొద్దీ దీపదానం, సాలగ్రామ దానం, అన్నదానం, వస్త్రదానం శుభం కలుగుతుందని విశ్వసిస్తారు. అలాగే శివుడికి రుద్రాభిషేకం, మహామృత్యుంజయ హోమం వంటి పూజలు చేయడం వల్ల జీవితంలో సానుకూలత, సిరి సంపదలు, ఆనందం, ఆరోగ్యం సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు.

Karthika Amavasya | దీపారాధన
కార్తీక అమావాస్య రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందంటని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజు సూర్యాస్తమయం తర్వాత.. నువ్వుల నూనెతో ఇంటి ముందు, దేవుడి వద్ద, తులసి కోట దగ్గర దీపం వెలిగించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అలాగే శ్రీమహావిష్ణువుకు తులసి మాలను సమర్పించడం విశిష్టమైందిగా చెబుతారు. ముఖ్యంగా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.
Karthika Amavasya | ఉపవాస దీక్ష
అమావాస్య రోజుతో కార్తీక మాసం ముగిసిపోతుంది. అందుకే ఈ రోజున ఉపవాస దీక్ష పాటిస్తే కార్తీక మాసమంతా ఉపవాసం ఆచరించిన ఫలితం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక అమావాస్య నియమాలను శాస్త్రయుక్తంగా ఆచరిద్దాం.
గమనిక : మేం అందించిన ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్లో లభించిన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.
ఇది కూడా చదవండి..: Sabarimala temple | అయ్యప్ప భక్తులకు శుభవార్త.. తెరుచుకున్న శబరిమల ఆలయం..
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
