తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Winter Asthma Care Tips | ఆస్థమా అనేది దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి. సాధారణంగా దీన్ని ఉబ్బసం అని పిలుస్తూ ఉంటాం. ఒకసారి ఈ సమస్య మొదలైతే జీవితాంతం కొనసాగే అవకాశం ఉంటుంది. చలికాలంలో ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గిపోవడంతో పాటు పొడి, చల్లని గాలి ప్రవాహం పెరగడంతో ఆస్థమా (Asthma) లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. ఊపిరితిత్తుల్లో గాలి మార్గాలు ఇరుకైపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రాత్రిపూట దగ్గు, గురక మరియు తీవ్రమైన ఆయాసం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.
అమెరికాకు చెందిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ( పరిశోధనల ప్రకారం.. చల్లని వాతావరణం, గాలి కాలుష్యం మరియు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఆస్థమా రోగుల్లో దాడులను రెచ్చగొట్టే ప్రధాన కారకాలు. కాబట్టి ఈ ఋతువులో రోగులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Winter Asthma Care Tips | చలికాలంలో పాటించాల్సిన జాగ్రత్తలు
చలికాలంలో వెచ్చని దుస్తులు ధరించండి. మెడ, తల, చెవులు, ముక్కు భాగాలు చల్లని గాలికి తగలకుండా స్కార్ఫ్, మఫ్లర్, టోపీ, చేతి తొడుగులు వాడండి. వులెన్ లేదా థర్మల్ దుస్తులు శరీర ఉష్ణోగ్రతను కాపాడుతాయి.
Winter Asthma Care Tips | ఉదయం త్వరగా బయటకు రావద్దు
తెల్లవారుజామున ఉష్ణోగ్రత ఎక్కువగా తగ్గి ఉంటుంది. కనీసం ఎండ కాస్తా వరకు ఇంట్లోనే ఉండటం మంచిది. ఉదయం త్వరంగా బయటకు రాకూడదు. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
Winter Asthma Care Tips | గోరువెచ్చని నీరు తాగండి
రోజుకు 8–10 గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగండి. దీనివల్ల శ్వాస మార్గాలు తేమగా ఉండి, ఇరుకైపోకుండా కాపాడుకోవచ్చు. అదనంగా అల్లం టీ, తులసి టీ, మిరియాల రసం వంటివి ఎక్కువగా తీసుకోవచ్చు.
ఇన్హేలర్ను సిద్ధంగా ఉంచుకోండి
డాక్టర్ సూచించిన మేరకు ప్రివెంటివ్ ఇన్హేలర్ (నీలిరంగు) లేదా రిలీవర్ ఇన్హేలర్ (ఆకుపచ్చ) ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోండి. లక్షణాలు తీవ్రమైతే వైద్యుల సూచనల ప్రకారం వాడండి.
శ్వాస వ్యాయామాలు ఆచరించండి
ప్రాణాయామం (అనులోమ విలోమ, భ్రామరీ, కపాలభాతి), డీప్ బ్రీతింగ్, పర్స్డ్ లిప్ బ్రీతింగ్ వంటివి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి. రోజూ 10–15 నిమిషాలు ఈ వ్యాయామాలు చేయడం ఎంతో ఉపయోగకరం.
ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ
చలికాలంలో జలుబు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లు ఆస్థమాను మరింత పెంచుతాయి. కాబట్టి మాస్క్ ధరించండి. తరచూ సబ్బుతో చేతులు కడుక్కోండి. జలుబు ఉన్నవారి నుంచి దూరంగా ఉండండి. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం గురించి డాక్టర్‌ను అడగండి.
కెఫీన్‌కు దూరంగా ఉండండి
టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్‌కు దూరంగా ఉండండి. వీటిలో ఉండే అధిక కెఫీన్ గుండె వేగాన్ని పెంచి శ్వాస సమస్యలను తీవ్రతరం చేయవచ్చు. బదులుగా మూలికల టీలు తీసుకోవడం మంచిది. అలాగే పొగ, సిగరెట్ ధూమం, ఐస్‌క్రీమ్, కోల్డ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల శ్వాస మార్గాలను ఇరుకును చేస్తాయి.
ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచండి
దుమ్ము, పొగ, ధూళి, పెంపుడు జంతువుల రోమాలు, ఫంగస్ ఆస్థమాను పెంచుతాయి. వీక్లీ వెట్ క్లీనింగ్ చేయండి. బెడ్ షీట్స్‌ను వేడి నీటిలో ఉతకండి. గదిలో హ్యూమిడిఫైయర్ వాడొచ్చు (అధిక తేమ కూడా సమస్య కాకుండా చూసుకోండి).
ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించండి
ప్యాకెట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్, అధిక ఉప్పు, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం శరీరంలో మంటను పెంచుతుంది. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి.
లక్షణాలు ఎక్కువైతే ఆలస్యం చేయకుండా వెంటనే ఛాతీ వైద్యుడిని లేదా పల్మనాలజిస్ట్‌ను సంప్రదించండి.
గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించారం. మీరు వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించండి. ప్రతి రోగి శారీరక స్థితి భిన్నంగా ఉంటుంది కాబట్టి మీ వ్యక్తిగత వైద్యుడి సూచనలకు ప్రాధాన్యత ఇవ్వండి.
ఇది కూడా చదవండి..: Winter Blues Natural Remedies | చలికాలంలో మూడీగా ఉంటున్నారా.. వింటర్ బ్లూస్‌ను ఎదుర్కోవడానికి సహజ మార్గాలివే..!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
