తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: HMDA lands | ఎకరం భూమి ప్రైమ్ ఏరియాలో అయితే రూ. 30 కోట్ల నుంచి రూ. 50 కోట్ల పలుకుతుంది. కానీ అక్కడ ఏకంగా రూ. 151 కోట్ల పలికిందంటే డిమాండ్ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఇంత కాస్లీ ల్యాండ్ ఎక్కడ అనుకుంటున్నారా.. ఇంకెక్కడ కోకాపేట. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట (Kokapet) ప్రాంతంలోని నియోపోలిస్ (Neopolis) లేఅవుట్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్వహించిన ఈ-వేలం సంచలనం సృష్టించింది. శుక్రవారం జరిగిన ఈ వేలంలో ఒక ఎకరం భూమి రూ.151.25 కోట్లకు చేరుకుని హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక ధరగా నమోదైంది.
HMDA lands | రికార్డుస్థాయి ధర
ప్లాట్ నంబర్ 15లోని 4.03 ఎకరాలను లక్ష్మీనారాయణ కంపెనీ ఒక ఎకరం రూ.151.25 కోట్ల చొప్పున కైవసం చేసుకుంది. అదే లేఅవుట్లోని ప్లాట్ నంబర్ 16లో ఉన్న 5.03 ఎకరాలను గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎకరం రూ.147.75 కోట్ల చొప్పున సొంతం చేసుకుంది. ఈ రెండు ప్లాట్లలో మొత్తం 9.06 ఎకరాలకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,353 కోట్ల ఆదాయం సమకూరింది. వేలం ప్రారంభ ధర ఎకరాకు రూ.99 కోట్లుగా నిర్ణయించినప్పటికీ, తీవ్ర పోటీ కారణంగా ధర రికార్డు స్థాయికి చేరింది. ఉదయం 11 గంటలకు మొదలైన వేలం ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు సాగింది.

HMDA lands | నాలుగు రోజుల వ్యవధిలోనే..
కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రెండోసారి రికార్డు బద్దలైంది. ఈ నెల 24వ తేదీన అదే నియోపోలిస్ లేఅవుట్లోని ప్లాట్ నంబర్ 18 ఎకరాకు రూ.137.25 కోట్లు పలకగా, ఇప్పుడు మరో రూ.14 కోట్లు అధికంగా నమోదు కావడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎంత వేగంగా ఎదుగుతోందన్నది స్పష్టం చేస్తోంది.
తదుపరి వేలం పాటలకు కూడా సన్నాహాలు పూర్తయ్యాయి. డిసెంబరు 3న నియోపోలిస్‌లోని ప్లాట్ నంబర్ 19, 20లలో మొత్తం 8 ఎకరాలకు పైగా భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయనుంది. అదే విధంగా డిసెంబరు 5న కోకాపేట గోల్డెన్ మైల్ లేఅవుట్లో 1.98 ఎకరాలను విక్రయించనున్నారు.

HMDA lands | రూ. వేల కోట్ల ఆదాయం..
హెచ్ఎండీఏకు భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ అనుమతుల కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే సంస్థకు రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. కొత్త ఏడాదిలో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, మెదక్ జిల్లాల్లోని బైరాగిగూడ, చందానగర్, పుప్పాలగూడ, బౌరంపేట్, చెంగిచర్ల, బాచుపల్లి, సూరారం వంటి ప్రాంతాల్లో ఉన్న విలువైన భూములను వేలం వేయనుండడంతో మొత్తం రూ.10 వేల కోట్లకు పైగా ఆదాయం సమీకరించే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కోకాపేట ప్రాంతం ఇప్పుడు దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా మారింది. ఈ రికార్డు ధరలు హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్‌కు కొత్త ఊపిరి పోస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..: sweet corn benefits | చలికాలంలో వేడివేడి స్వీట్ కార్న్.. రుచితో పాటు ఆరోగ్యం..
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
