తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: ragi rotti | ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారింది. అందుకే చాలామంది పోషకాలు పుష్కలంగా ఉండే సాంప్రదాయ ఆహార పదార్థాల వైపు మళ్లుతున్నారు. అలాంటి వాటిలో రాగి రొట్టెలు ప్రముఖమైనవి. రాగి పిండిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. దీంతో బరువు తగ్గాలనుకునే వారితో పాటు మధుమేహం ఉన్నవారికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి.
అయితే రాగి రొట్టెలు తయారు చేసేటప్పుడు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. పిండి ముద్ద గట్టిగా అయిపోవడం లేదా చపాతి చేస్తున్నప్పుడు చిట్లిపోవడం లాంటివి జరుగుతుంటాయి. కానీ సరైన పద్ధతిని అనుసరిస్తే, గోధుమ రొట్టెల్లా మెత్తగా, పొరలు పొరలుగా సులభంగా చేసుకోవచ్చు. ఈ చిన్న చిట్కాలతో దూది మెత్తని రాగి రొట్టెలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా..!

ragi rotti | కావాల్సిన పదార్థాలు
- రాగి పిండి – ఒక కప్పు
- నీళ్లు – ఒక కప్పు
- నూనె లేదా నెయ్యి – ఒక టీస్పూన్
- ఉప్పు – రుచికి తగినంత

ragi rotti | తయారీ విధానం
- ముందుగా గిన్నెలో ఒక కప్పు నీటిని స్టవ్ మీద పెట్టి మరిగించండి. ఆ తర్వాత నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేయండి. నూనె వేయడం ద్వారా రొట్టెలు ఎక్కువ సేపు సాఫ్ట్‌గా ఉంటాయి.
- నీళ్లు బాగా మరిగిన తర్వాత మంటను తగ్గించి లేదా స్టవ్ ఆఫ్ చేయాలి. వెంటనే రాగి పిండిని ఆ వేడి నీటిలో కలపండి. గరిటె లేదా విస్క్‌తో ముద్దలు లేకుండా బాగా కలియబెట్టారు. ఆ తర్వాత గిన్నెకు మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు పక్కన ఉంచండి.
- పిండి గోరువెచ్చగా అయిన తర్వాత ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోవాలి. చేతులతో బాగా మర్దించి పిసకండి. ఎంత ఎక్కువగా పిసికితే రొట్టె అంత సాఫ్ట్‌గా వస్తుంది. చేతికి కొద్దిగా నూనె రాసుకుని మెత్తని ముద్దలా తయారు చేసుకోండి.
- ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని.. పొడి రాగి పిండి లేదా గోధుమ పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో మెల్లగా తాల్వండి. వేడి నీటిలో కలిపినందువల్ల రొట్టె అంచులు పగలకుండా చక్కగా ఉంటుంది.
- పెనం వేడెక్కిన తర్వాత రొట్టెను వేసి, ఒక వైపు బుడగలు వచ్చాక మరో వైపు తిప్పండి. రెండు వైపులా కాలిన తర్వాత మెత్తటి గుడ్డతో అంచులు ఒత్తితే బాగా పొంగుతుంది. లేదా నేరుగా మంట మీద కాల్చినా పూరీలా ఉబ్బుతుంది.
ragi rotti | టెస్టీగా..
ఈ రాగి రొట్టెలను పప్పు, పచ్చళ్లు, వంకాయ కూర లేదా ఏదైనా కర్రీతో తింటే అద్భుతంగా ఉంటుంది. లంచ్ బాక్స్‌లో పెట్టుకుపోయినా గంటల తర్వాత కూడా సాఫ్ట్‌గానే ఉంటాయి. ఈ సులభమైన చిట్కాతో ఆరోగ్యవంతమైన రాగి రొట్టెలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి.
ఇది కూడా చదవండి..: stainless steel containers | స్టీల్ పాత్రల్లో నిల్వ చేయకూడని ఫుడ్ ఐటమ్స్ ఇవే.. ఈ జాగ్రత్తలు పాటించండి..!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
