తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: New Labour Codes | ఉద్యోగుల హక్కులు, భద్రత, సంక్షేయం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త కార్మిక కోడ్లను తీసుకొచ్చింది. అవి నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ సంస్కరణల ద్వారా సంఘటిత రంగంతో పాటు అసంఘటిత రంగంలోని గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫాం వర్కర్లను కూడా సార్వత్రిక సామాజిక భద్రతా వ్యవస్థలో చేర్చారు. అందరు ఉద్యోగులకు నియామక ఉత్తర్వులు తప్పనిసరి చేయడంతో పాటు, పారదర్శకత మరియు స్థిరమైన ఉపాధికి లిఖిత హామీ లభిస్తుంది. అన్ని రంగాల్లో కనీస వేతనాలు, లింగ వివక్ష లేకుండా సమాన వేతనం, సకాలంలో వేతన చెల్లింపులు వంటి ముఖ్యమైన ప్రయోజనాలు ఇకపై కార్మికులకు అందుబాటులోకి రానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం పాత 29 కార్మిక చట్టాలను ఏకీకృతం చేస్తూ తయారు చేసిన నాలుగు కొత్త కోడ్లు తీసుకొచ్చింది. ఇందులో వేతనాల కోడ్-2019, పారిశ్రామిక సంబంధాల కోడ్-2020, సామాజిక భద్రత కోడ్-2020, వృత్తిపర భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్-2020 అమలులోకి వచ్చాయి. ఈ సంస్కరణలు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, సమాన వేతనాలు, మహిళల సాధికారతతో పాటు గిగ్ మరియు ప్లాట్‌ఫాం వర్కర్లకు ప్రత్యేక రక్షణ కల్పించడంలో మైలురాయిగా నిలుస్తాయి. అన్ని ఉద్యోగులకు నియామక ఉత్తర్వులు తప్పనిసరి చేయడంతో ఉపాధి స్థిరత్వం మరియు పారదర్శకతకు బలమైన హామీ లభిస్తుంది.
New Labour Codes | గిగ్ వర్కర్లకు పీఎప్ సౌకర్యం
గిగ్ మరియు ప్లాట్‌ఫాం వర్కర్లతో సహా అందరికీ ప్రావిడెంట్ ఫండ్ (PF), ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ESIC), బీమా వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందనున్నాయి. ఫిక్స్డ్ టర్మ్ ఉపాధి (FTE) ఉద్యోగులకు కూడా స్థిర ఉద్యోగులతో సమానంగా సెలవులు, వైద్య సౌకర్యాలు, సామాజిక భద్రత లభిస్తుంది. ఇకపై FTE ఉద్యోగులు ఐదేళ్ల బదులు కేవలం ఒక్క ఏడాది సర్వీసు పూర్తి చేసిన తర్వాత నుంచే గ్రాట్యుటీకి అర్హులవుతారు. అన్ని కార్మికులకు కనీస వేతనం చట్టబద్ధ హక్కుగా మారింది. వేతనాలు సకాలంలో చెల్లించని యజమానులపై జరిమానాలు విధిస్తారు. ఐటీ రంగ ఉద్యోగులకు ప్రతి నెల 7వ తేదీలోపు వేతనం అందేలా నిబంధనలు ఉన్నాయి.
New Labour Codes | అసంఘటిత రంగ కార్మికుల కోసం..
బీడీ పరిశ్రమ, సిగరెట్ తయారీ, మైనింగ్ వంటి రంగాల్లో 8 నుంచి 12 గంటల వరకు పని చేసే సౌలభ్యం కల్పించారు. అయితే వారానికి 48 గంటలు మించకూడదు. 40 ఏళ్లు దాటిన అందరు ఉద్యోగులకు యజమానులు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి. సమాన పనికి లింగ భేదం లేకుండా సమాన వేతనం తప్పనిసరి. సాధారణ పని గంటలు మించితే రెట్టింపు వేతనం చెల్లించాలి. రాత్రి షిఫ్టులు, అండర్‌గ్రౌండ్ మైనింగ్ వంటి పనుల్లో మహిళలు పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. దానికి తగిన భద్రతా చర్యలు యజమానులు తీసుకోవాలి.
గిగ్ వర్క్, ప్లాట్‌ఫాం వర్క్, అగ్రిగేటర్లను (ఉదా: ఉబర్, స్విగ్గీ వంటి కంపెనీలు) చట్టంలో మొదటిసారి నిర్వచించారు. ఈ అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్‌లో 1 నుంచి 2 శాతం సామాజిక భద్రతా నిధికి కేటాయించాలి. ఆధార్ ఆధారిత సామాజిక భద్రతా ప్రయోజనాలు రాష్ట్రాల మధ్య వలసలతో సంబంధం లేకుండా పూర్తిగా పోర్టబుల్‌గా ఉంటాయి. జర్నలిస్టులు, డిజిటల్ మీడియా కార్మికులు, డబ్బింగ్ ఆర్టిస్టులు, స్టంట్ ఆర్టిస్టులు సహా అందరూ పూర్తి సామాజిక భద్రతా ప్రయోజనాలకు అర్హులు.
New Labour Codes | ప్రతి కార్మికుడికి గౌరవం – మోదీ ప్రభుత్వ హామీ
“ప్రతి కార్మికుడికి గౌరవం” అనేది మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీ అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రమాదకర రంగాల్లో వంద శాతం ఆరోగ్య భద్రత, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సామాజిక న్యాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త సంస్కరణలు ఆత్మనిర్భర భారత్‌కు బలమైన అడుగుగా నిలుస్తాయని, వికసిత భారత్ లక్ష్యానికి కొత్త ఊపిరి పోస్తాయని మంత్రి వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్మిక కోడ్ల అమలును స్వాగతిస్తూ “శ్రమేవ జయతే” అని పోస్టు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన అత్యంత సమగ్రమైన, ప్రగతిశీల కార్మిక సంస్కరణలు ఇవే అని ఆయన అభివర్ణించారు. ఈ చట్టాలు కార్మికులకు శక్తినిస్తాయని, హక్కులను కాపాడుతూనే దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్‌కు వచ్చేస్తున్నాయ్.. లాంచింగ్ అప్పుడే..!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
