తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: RBI interest Rates | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి ప్రజలకు శుభవార్త అందించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
దీంతో రెపో రేటు ప్రస్తుతం 5.25 శాతానికి చేరింది. ఈ నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు.
RBI interest Rates | ఈ ఏడాది నాలుగోసారి..
ఈ ఏడాది ఇప్పటివరకు ఇది నాలుగో రేటు కోత కావడం విశేషం. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున, జూన్‌లో ఒకేసారి 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్‌బీఐ.. ప్రస్తుతం మరో 25 బేసిస్ పాయింట్ల కోత విధించింది. దీంతో మొత్తం 1.25 శాతం వడ్డీ రేట్లను తగ్గించినట్లయింది. ఈ నిరంతర కోతలతో హోం లోన్, కారు లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న కోట్లాది మంది రుణగ్రహీతలకు ఈఎంఐ భారం నుంచి మరింత ఉపశమనం లభించనుంది.
గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. “రూపాయి మారకం విలువలో కొంత ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం చాలా గతంలో లేనంతగా కనిష్ఠ స్థాయికి చేరుకోవడం, ఆర్థిక వృద్ధి ఊపందుకోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలు” అని వివరించారు.
RBI interest Rates | సమీక్షలో ప్రకటించిన మరిన్ని ముఖ్య అంశాలు..
- 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 6.8 శాతం నుంచి 7.3 శాతానికి భారీగా పెంచుతూ ఆర్‌బీఐ ఆశాజనక సంకేతాలు ఇచ్చింది. జీఎస్టీ సంస్కరణలు, వినియోగం పెరుగుదల కారణంగా రెండో త్రైమాసికంలోనే 8.2 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది.
- ద్రవ్యోల్బణం అంచనాను 2.6 శాతం నుంచి 2.0 శాతానికి తగ్గించారు. ఇది సామాన్య ప్రజలకు మరింత ధరల స్థిరత్వాన్ని సూచిస్తుంది.
- ద్రవ్యత పెంచేందుకు రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (OMO) ద్వారా కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
- ఇక దేశీయ విదేశీ మారక నిల్వలు 686 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది రాబోయే 11 నెలల దిగుమతులకు సరిపడే స్థాయిలో ఉన్నట్లు గవర్నర్ చెప్పారు.
RBI interest Rates | రుణగ్రహీతలకు ఊరట
వరుసగా వడ్డీ రేటులో కోత విధించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ మరింత పెరిగి, పెట్టుబడులు, వినిమయం ఊపందుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బ్యాంకులు కూడా ఈ తగ్గింపును తమ లోన్ రేట్లకు త్వరగా అనుసంధానం చేయాలని ఆర్‌బీఐ ఒత్తిడి తెస్తోంది. సామాన్య రుణగ్రహీతలకు తాజా నిర్ణయం ఊరటనివ్వనుంది.
ఇది కూడా చదవండి..: BSNL 1 rupee plan | బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి రూ.1 సూపర్ ప్లాన్.. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2జీబీ డేటా..
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
