తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Prashant kishor | ప్రశాంత్ కిషోర్.. దేశ రాజకీయాల్లో ఈయన పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలోని అనేక పార్టీలను గెలుపు తీరాలకు చేర్చారు. దేశంలో చాలా పార్టీలు ఆయనతో పనిచేసేందుకు ఆరాటపడుతుండేవి. అయితే తాజాగా ఆయన పరిస్థితి ‘అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్లు’గా మారింది. ఎందుకంటే ఆయన స్థాపించిన జన్ సురాజ్ పార్టీ బీహార్ డకౌట్ అయ్యింది. 238 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది.
Prashant kishor | బొక్కబోర్లా పడ్డ జన్‌సురాజ్ పార్టీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకుమించి ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించింది. 200లకు పైగా సీట్లు దక్కించుకుంది. ఇక ప్రతిపక్ష మహాగఠ్ బంధన్ కూటమి 35 సీట్లకే పరిమితమైంది. ఇక ప్రశాంత్ కిషోర్ (Prashant kishor) పార్టీ ఖాతా కూడా తెరవకుండా బొక్కబోర్లా పడింది. ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీతో (I-PAC) వివిధ రాష్ట్రాల్లో పలు పార్టీలను అధికారంలో తీసుకురావడంలో పీకే కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం తన సొంత రాష్ట్రంలో ఆయన వ్యూహాలు విఫలమయ్యాయి.
Prashant kishor | ఐ-ప్యాక్‌తో ఫేమస్..
ప్రశాంత్ కిషోర్ గతంలో ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) స్థాపించారు. వివిధ దేశాల ఎన్నికల్లో అనుసరించే ప్రచార శైలిని భారత్‌లో తీసుకువచ్చారు. దశాబ్ద కాలానికి పైగా వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. సమాచార విశ్లేషణ ఆధారిత విధానాలు అవలంభించడం, బూత్ స్థాయి నిర్వహణ, క్షేత్రస్థాయి సమస్యలు, సోషల్ మీడియా ప్రచారం వంటి అస్త్రాలతో పార్టీలను విజయ తీరాలకు చేర్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పని చేసిన పీకే.. చాయ్ పే చర్చా, అబ్ కీ బార్ మోదీ సర్కార్ వంటి నినాదాలతో నరేంద్ర మోదీ ప్రధాని కావడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్, బీహార్ నీతీశ్ కుమార్ గెలుపునకు పనిచేశారు. ఆ తర్వాత పంజాబ్‌లో అమరీందర్ సింగ్, తమిళనాడులో డీఎంకే, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు పనిచేసి.. ఆయా పార్టీలు అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు.

Prashant kishor | వ్యూహాలు విఫలం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సునామీ సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి విజయ ఢంకా మోగించింది. ఎన్నికల ముందు ఎన్డీఏ, మహాగఠ్ బంధన్ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని భావించారు. అంతేకాకుండా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్‌సురాజ్ పార్టీ కూడా గణనీయమైన మార్పుకు కారణం కావొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ తాజా ఫలితాల్లో జన్‌సురాజ్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. తన వ్యూహ చతురతతో దేశవ్యాప్తంగా ఎన్నో పార్టీలకు గెలుపు అందించిన ప్రశాంత్ కిషోర్ పాచికలు.. స్వరాష్ట్రంలో పారలేదు.
Prashant kishor | సొంత రాష్ట్రంలో పారని పాచికలు
ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు తన సొంత రాష్ట్రంలో రివర్స్ అయ్యాయి. రాష్ట్రంలో వలసలు తగ్గించి, నిరుద్యోగం లేకుండా చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా అభివృద్ధిలో వెనకబడిపోయిన రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు. అయినా కూడా బీహారీలు ఆయన వైపు కన్నెత్తి చూడలేదు. ఆయన ప్రయోగించే అస్త్రాలైన సమాచార ఆధారిత ప్రచారం, సోషల్ మీడియా, బూత్ స్థాయి నిర్వహణ ఇవేవీ పనిచేయలేదు. ఎన్నికలకు రెండు, మూడేళ్ల నుంచే సన్నద్ధం అయినా ఓటర్లలో నమ్మకం కల్పించడంలో విఫలమయ్యారు.
ఇది కూడా చదవండి..: Aadhaar App | కొత్త Aadhaar యాప్ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. ఉపయోగాలు ఏంటో తెలుసా..!
