తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: F1 Visa | అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లాలని ఆశపడే లక్షలాది అంతర్జాతీయ విద్యార్థులకు.. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు అమెరికా నుంచి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ఎఫ్-1 విద్యార్థి వీసా దరఖాస్తులను తిరస్కరించడంలో అతిపెద్ద అడ్డంకిగా ఉన్న ‘తిరిగి స్వదేశానికి వెళ్లే ఉద్దేశం’ (Intent to Depart) నియమాన్ని పూర్తిగా తొలగించే దిశగా అమెరికా కాంగ్రెస్లో కీలక బిల్లు ప్రవేశపెట్టారు.
F1 Visa | ‘డిగ్నిటీ యాక్ట్ 2025’ పేరుతో..
‘డిగ్నిటీ యాక్ట్ 2025’ పేరుతో ఈ చట్ట ప్రతిపాదనను రూపొందించిన శాసనసభ్యులు, చదువు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా స్వదేశానికి తిరిగి వెళ్తామని నిరూపించుకోవాల్సి అవసరం లేదనే విధానాన్ని మార్చాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఎఫ్-1 వీసా ఇంటర్వ్యూలో కాన్సులర్ అధికారులు “చదువు అయిపోతే వెంటనే దేశం విడిచి వెళ్తారా?” అని ప్రశ్నిస్తున్నారు.. దానికి బలమైన ఆధారాలు లేకపోతే వీసాను నిరాకరిస్తున్నారు. సొంత దేశంలో ఆస్తులు, ఉద్యోగ ఆఫర్లు, కుటుంబ బంధాలు వంటి పత్రాలతో ఈ ఉద్దేశ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన వల్లే గత కొంతకాలంగా, ముఖ్యంగా భారతీయ విద్యార్థుల ఎఫ్-1 వీసాల తిరస్కార రేటు గణనీయంగా పెరిగింది.

F1 Visa | కొత్త చట్టం అమలయితే..
కొత్త చట్టం అమలయితే ఇకపై ‘చదువు అయిపోయాక తిరిగి స్వదేశానికి వెళ్తారా..’ ప్రశ్నే రాదు. విద్యార్థులు చదువు పూర్తి చేసిన తర్వాత అమెరికాలోనే ఉద్యోగ అవకాశాలను వెతకడం, ఆప్ట్ (OPT) లేదా ఇతర వీసా రూట్ల ద్వారా దీర్ఘకాలికంగా ఉండే మార్గం సులువుగా మారనుంది. దీని ఫలితంగా అమెరికాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని, అది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని ట్రంప్ పరిపాలన విభాగం భావిస్తోంది.
F1 Visa | ప్రస్తుతం బిల్లు దశలోనే…
ప్రస్తుతం ఈ బిల్లు ఇంకా చట్టంగా మారలేదు. కాంగ్రెస్ రెండు సభల్లోనూ ఆమోదం లభించి, అధ్యక్షుడు సంతకం చేస్తేనే ఇది అధికారికంగా అమలులోకి వస్తుంది. అదే సమయంలో, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ కూడా ఎఫ్-1 వీసాలకు సంబంధించి ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ నుంచి ‘నిర్ణీత కాలపరిమితి’ వ్యవస్థకు మారే ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.
ఈ రెండు మార్పులూ అమలులోకి వచ్చినట్లయితే అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు చాలా పెద్ద ఊరటగా మారనుంది. రానున్న నెలల్లో ఈ బిల్లు ఏ స్థాయిలో పురోగమిస్తుందని లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి..: F-35 fighter jets | సౌదీకి F-35 ఫైటర్ జెట్లు విక్రయించనున్న అమెరికా.. MBS వాషింగ్టన్ పర్యటనలో కీలక ప్రకటన
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
