తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Dhantrayodashi | వెలుగు దివ్వెల దీపావళి పండుగ వచ్చేసింది. ఐదురోజుల వేడుకల్లో తొలి రోజు ధన త్రయోదశి (ధన్ తేరస్) జరుపుకొంటామని మనకు తెలిసిందే. అయితే ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మి కటాక్షం పొందవచ్చని కోట్ల మంది నమ్మకం. ఈ రోజున తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయాలా.. ఒకవేళ కొనలేకపోతే ఎలా.. ఇంకా ఏవైనా కొంటే లక్ష్మ కటాక్షం సిద్ధిస్తుందా అనే విషయాలు తెలుసుకుందాం..
Dhantrayodashi | ధన త్రయోదశికి ఎంతో ప్రాముఖ్యత
ధన త్రయోదశి (Dhantrayodashi) తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆశ్వయుజ అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకొంటాం. ఈ రోజున ప్రదోషకాలంలో అంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి 8 గంటల వరకు శివారాధన చేయడం ఎంతో శ్రేష్టమైంది.
Dhantrayodashi | ఆనవాయితీగా వస్తున్న బంగారం కొనుగోలు..
ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఈ త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకొంటారు. దీనిని ఉత్తరాదిలో ధన్ తేరస్ అని అంటారు. ఈ రోజున లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులు ఉంటాయని భావిస్తారు. దీపావళి ముందు వచ్చే ఈ ధన త్రయోదశి నాడు బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీ వస్తోంది. ఎక్కువ మంది పసడి కొనుగోలుకే ఆసక్తి చూపిస్తుంటారు.
Dhantrayodashi | ఎందుకు కొనాలని చెబుతారంటే..
ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవికి ప్రతిరూపాలుగా భావించే బంగారు, వెండి వంటివి కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. వీటి కొనుగోలు వల్ల లక్ష్మీదేవితో పాటు సంపదలకు అధిపతి అయిన కుబేరుడి అనుగ్రహం కూడా కలుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు. అందుకే ఈ రోజున బంగారం, వెండి కొంటుంటారు. అలాగే ఇదే రోజు నుంచి దీపావళి వేడుకలు ప్రారంభం అవుతాయి. బంగారంతో దీపావళి సంబరాల్లో మొదటిరోజు లక్ష్మీదేవికి ఆహ్వానం పలకడం సంప్రదాయం వస్తోంది.
Dhantrayodashi | బంగారం తప్పకుండా కొనాలా..!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధన త్రయోదశి రోజు బంగారం, వెండి లాంటివి వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదమని భావిస్తారు. అయితే బంగారం ధరలు భారీగా పెరిగిపోవడం వల్ల కొనుగోలు చేయడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. వీటికి ప్రత్యామ్నాయంగా ఇతర వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చని పండితులు చెబుతున్నారు.
Dhantrayodashi | వీటిని కూడా కొనుగోలు చేయవచ్చు..
సాధారణంగా ఇంట్లో వాడే ఉప్పు, ధనియాలు, జీలకర్ర, పచ్చ కర్పూరం లాంటి వాటిని లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తారు. అందుకే ధన త్రయోదశి రోజు ఈ వంటింటి సరుకులు కొనడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చునని పండితులు పేర్కొంటున్నారు. అలాగే కొత్త పాత్రలు కొనడం అనాదిగా వస్తోంది. భాగవతం ప్రకారం ధన్వంతరి క్షీర సాగరం నుంచి అమృత కలశంతో ఉద్భవించాడు. కావున ఈ రోజు కొత్త పాత్రలు కొనడం శుభంగా భావిస్తారు. అలాగే ఇత్తడి అనేది ధన్వంతరికి ప్రీతికరమైన లోహంగా చెబుతారు. అందుకే.. ఇత్తడి పాత్రలు కొనడం వల్ల ఆరోగ్యం, అదృష్టంతో పాటు సంపద కూడా పెరుగుతుందని విశ్వసిస్తారు. కొత్త చీపురు కొనడం కూడా మంచిదని చెబుతున్నారు.
Dhantrayodashi | వీటిని ఇంట్లో ఉంచడం మంచిది..
ధన్ తేరస్ రోజు బంగారం, వెండి కొనలేనివారు శ్రీయంత్రం, కుబేర యంత్రం కొనుగోలు చేయడం శుభప్రదం. వీటిని ఇంట్లో గాని వ్యాపార ప్రదేశంలో గాని పెట్టడం ద్వారా లక్ష్మీకుబేరుల అనుగ్రహం సిద్ధిస్తుందని చెబుతారు. 11 గోమతి చక్రాలను కొని.. వాటిని ఎర్రటి గుడ్డలో చుట్టి ఇంట్లో పెట్టుకోవచ్చని పండితులు పేర్కొంటున్నారు. అదేవిధంగా పసుపు గవ్వలు కొని పూజామందిరంలో ఉంచితే సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వసిస్తారు.
గమనిక : పైన తెలిపిన వివరాలు మాకు ఉన్న సమాచారం మేరకు ఇచ్చినవి మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు. దీనిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత అంశం.
Custard Apple | మధురం.. సీతాఫలం.. ఆరోగ్యకరం.. మరి షుగర్స్ పేషెంట్స్ తినొచ్చా..!
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!