Delhi Car Blast |ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది దుర్మరణం..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ ఏరియాలో నిలిపిన ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 24 మంది తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. గాయపడినవారిని తక్షణమే సమీపంలోని ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిన్నాభిన్నమయ్యాయి.
Delhi Car Blast |సాయంత్రం సమయంలో..
పేలుడు సాయంత్రం 6:55 గంటల సమయంలో అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి ఏడు అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. వెంటనే మంటలను అదుపు చేశాయి. పేలుడు ప్రభావం వల్ల చుట్టుపక్కల ఉన్న పలు కార్లు, ఈ-రిక్షాలు, ఆటోరిక్షాలు కాలి బూడిదయ్యాయి. ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసమైపోయాయి.
కాగా.. పేలుడుకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. కారులో పేలుడు పదార్థాలు ఉంచి, రిమోట్ కంట్రోల్ ద్వారా ఎవరైనా పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, క్రైం బ్రాంచ్, క్లూస్ టీంలతో పాటు ఎన్ఐఏ బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో ఆధారాల సేకరణ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. సోమవారం కావడంతో పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లు సాధారణంగా తక్కువ రద్దీగా ఉంటాయి. దీంతో ప్రమాద తీవ్రత కొంత తగ్గిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేశారు. ఢిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. సింఘు, టిక్రీ, బదర్పూర్ వంటి కీలక పాయింట్లలో అదనపు పోలీసు బలగాలు మోహరించారు. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, ఇతర సున్నిత ప్రదేశాల్లో నిఘా పెంచారు.
Delhi Car Blast |ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధితులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రికి కేంద్ర హొం మంత్రి అమిత్ షా చేరుకున్నారు. బాధితుల పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
Health benefits of dried fish | ఎండు చేపలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai


